అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

23, జనవరి 2010, శనివారం

తొలి పలుకులు-2 | వాత్సాయన వరులు


వాత్సాయన వరులు



వెన్నెల వెలుగులలో వన్నెలు వొలుకబోస్తూ
వేళకానివేళ  వొంటరి వారిని వేడెక్కించి
వలపుల వూయలలో వారిని వూపివేసి
వానజడిలోనైనా వంటిని వెచ్చంగానే వుంచే
వయారి వనితలు వేలమంది వుండరేల?
వారిని వరించు వరులు వాత్సాయనులేనా ?


- Luckyమురారి

ఈ 'తొలి పలుకు'ని బ్లాగు కొరకు రాస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. చివరి పంక్తి లో, అలా కాకుండా
వారిని వరించు వరులు  వేలల్లో వొక్కరేనా ?
అని రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక 'funny ' ఆలోచన వచ్చింది . వారు వేళల్లో ఒక్కరిని కాకుండా ఒక్కొక్కరు వేల మందిని చేసుకుంటారా ఏమి నా పిచ్చిగాని  అని అనిపించింది :) ఏమైనా వాత్సాయనుడు నిజంగా అదృష్టవంతుడేనని ఒప్పోకోవాలండీ .


సమాప్తం 

తొలి పలుకులు-1 | మదనపడే మనసు


మదనపడే మనసు



మదీయ మదిన మెరిసిన ముగ్ధ మనోహర మోము 
ముంగిట ముత్యమై మెరిసిన మొదలు 
మదనపడెనేల మరి మా మనసు 
ముందున్న ముసలమెరిగినేమో 
- Luckyమురారి

ఇది నా జీవితంలో మొట్ట మొదటి సారి నేను రాసిన 'తొలి పలుకు'. చిన్న తనము వల్లనో లేక  అనుభవం లేకపోవడం వల్లనో దీనిలో కొంత వరకు స్పష్టత తగ్గింది. అయినా నాకు ఇది నాకు ప్రియమైనది. ఎంతైనా "First Creation " కదా!



సమాప్తం 

తొలి పలుకుల మీద కొన్ని 'తొలి పలుకులు '

 నేను చిన్న చిన్న పద్యాలు రాస్తున్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం కొరకు మనసు తపించిపోతూ ఉండేది. ప్రయోగం అంటే పాత కాలం వారి లాగా కొన్ని సూత్రాలకు అనుగుణంగా రాయాలని కాదు. శ్రీ శ్రీ గారి లాంటి వారిని స్పూర్తిగా తీసుకుంటూ సరళంగానూ , నా మనసు కోరుకునే విధంగా ప్రయోగాలు చేస్తూనూ రాయాలనుకున్నాను. అందుకు ఆలోచించగా నాకు వచ్చిన ఒక మంచి ఆలోచనే 'తొలి పలుకులు' . ఈ రకపు ప్రయోగము ముందరే ఉన్నదో లేదో నాకు తెలియదు కాని ఈ రకపు పద్యాలకు నేను పెట్టుకున్న పేరు 'తొలి పలుకులు'. అలా చాలానే రాసాను. కాని చాలా మంది లాగానే నేను వాటిని భద్రపరచుకోలేదు. మిగిలిన కొన్నింటిని నేను ఈ బ్లాగులో పాటకుల(?)తో పంచుకుందామనుకున్నా .


ఈ 'తొలి పలుకులు' అన్నింటికీ నిభందన ఒక్కటే. చిన్న నిభందన కానీ చాలా కష్టమైనదే. నిభందన ఏమిటంటే పద్యము లోని ప్రతి పదములోని మొదటి అక్షరములన్నీ ఒక్కటే అయి ఉండాలి. పదములు స్వతంత్రముగా వాడలేము కనుక పద్యాలలో కొన్ని అచ్చ తెలుగు పదాలు ఉంటె కొన్ని అరువు తెచ్చుకున్నవి కూడా ఉండవచ్చు. పంక్తుల సంఖ్య పైన కాని , ప్రాస విషయంలో కాని ఎటువంటి నిభందనలు లేవు. భావము సాధ్యమైనంత సులభంగా అర్ధం కావాలి. భావ సరళత నిభందన కాదు కాని నాకు సంబంధించిన అంత వరకు భావనలు సులభంగా అర్ధమయ్యేలాగా ఉంటేనే ఇష్టపడతా. అందుకే కొంత వరకు కష్టమయిన పదాలు వాడినా చేతనైనంత వరకు సులభమైన పద్యాల కొరకే ప్రయత్నించా.


'తొలి పలుకుల' గురించి మీకు ఇంకా తెల్సి పోయింది కదా! ఇంక ఈ 'తొలి పలుకుల' తుంపెరలో తడసిపోండి :)


సమాప్తం