అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఊహా సుందరి


కలల్లోనే తిరుగుతూ కవ్వించే నా రాణి
కనుల ముందుకు వచ్చి వలపుల వర్షించదేమి?

ఊయల నడకలననుసరించు  తన వాలుజడ
ఊహలలో నను ఎక్కించెను అందాల మేడ

మచ్చలేని జాబిలివంటి ఆమె వదనం
చూడగనె వెలవెల బోయెను ఆ నందనవనం

కలువల కంటగింపైన ఆ గాజుకనులు
నా కనులలో పుట్టించెను మెరుపుల చెమక్కులు

చెలినెపుడూ అంటిపెట్టుకు ఉండే వెండి నవ్వులు
రాల్చును ధరపై మేలిముత్యాల రాశులు

తన పెదవులపైనే తలదాచుకున్నఆ ఎరుపు
చూడగ ఆ గులబీలకు అసూయ గొలుపు

ఎన్నెన్నో అందాలు కలిగినది ఈ లోకం
దీన్ని మించినది తన అందమున్న ఆ ఊహాలొకం

వన్నె చిన్నెల నా చెలి దిగిరాగా ఈ లోకం
వెలవెలబోదామరి తానులేని ఆ కలలలోకం 

5, సెప్టెంబర్ 2009, శనివారం

తొలకరిలో తొలి పలుకులు

ఎంతో కాలంగా బ్లాగు ప్రపంచం ( బ్లాగోళం ) లో ’Active' గా ఉన్నా కాని ఇంత వరకు మాతృభాషలో రాయడం కుదరలేదు. అలాగని నాకు తెలుగు భాషా పరిజ్నానం ( 'parignaanam' టైపు చేయడమెలాగో ఎవరైనా తెలుపగలరు ) లేదనుకోవద్దు. నాకు జ్నానం , భాషా పరిజ్నానం రెండూ ఉన్నాయండోయ్ . చిన్నప్పటి నుంచి   కవితలు, కావ్యాలు, పురాణాలు, కథలు చదివి వంట  పట్టించుకున్న తెలుగుని తెగులు పట్టించకూడదని 10వ తరగతి నుండి రాతలు, కూతలు, కోతలు రాయడం మొదలు పెట్టాను. సరే వాటినన్నింటిని ప్రచురిద్దామని ఈ బ్లాగు మొదలు పెట్టా. ఇది కనీసం ఆరు నెలల కిందటి మాట. ఆంధ్రులు ఆరంభ శూరులు అని నిరూపించుటకు కంకణం కట్టుకున్నట్లు ఇంత వరకు మొదటి టపా వ్రాయడం కుదరలేదు. ఇక పైన అయినా కాస్త నిలకడ ప్రదర్శిస్తానని ఆశిస్తూ గణపయ్యకు పూజతో మొదలుపెడుతున్నా

శుక్లాం భరదరాం విష్ణుం శశి వర్ణం ఛతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజాణన పద్మార్కం గజాణనమ్ అహార్నిషం
అనేకదం తమ్ భక్తానామ్ ఏకదంతం ఉపాస్మహే